గుంటూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లడం తొందరపాటు చర్య అని మంత్రి పల్లంరాజు ఆదివారం గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా విలేకరులతో అన్నారు. అయితే జగన్ కొన్ని తొందరపాటు చర్యలు చేసినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటారన్నారు. ఆయన తొందరపాటును త్వరలో తెలుసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ కాంగ్రెస్ వారంతా అభిమానించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు అని, కాబట్టి ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలనే కోరుకుంటున్నామన్నారు.
కాగా ఒరిస్సాలో మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. ఆయనను విడిపించే ప్రయత్నాలు కేంద్రం చేస్తుందని అన్నారు. దేశంలో అంతర్గత భద్రతా చర్యలు చేపట్టడానికి అవసరమైన పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కోస్ట్‌గార్డ్ ట్రెయినింగ్ సెంటర్‌ను నిజాంపట్నంకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విశాఖ, హైదరాబాద్ నగరాలలో రక్షణ ఆయుధాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు.
No comments:
Post a Comment