హైదరాబాద్: ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం టిక్కెట్ల కోసం
ప్రయత్నించి తొక్కిసలాటలో కన్నయ్య అనే అభిమాని మృతి చెందిన ఘటనపై ఆ చిత్ర
నటుడు రామ్ చరణ్ తేజ్ స్పందించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై విచారం
వ్యక్తం చేసారు. కన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన రామ్
చరణ్.....అతని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు
ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్ వద్ద బుధవారం(అక్టోబర్ 1)
జరిగిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్ అభిమాని అయిన కన్నయ్య...
గోవిందుడు అందరి వాడేలే తొలి రోజు తొలి షో చూడానే కోరికతో టిక్కెట్ల కోసం
లైన్లో నిల్చున్నాడు. అయితే జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది.
టిక్కెట్ క్యూ లైన్లో జనాల మధ్య ఇరుక్కుపోయిన కన్నయ్య ఊపిరి ఆడక మరణించాడు.
కన్నయ్య మృతికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు
దిగారు. సరైన భద్రత ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఘటన చోటు చేసుకుని ఉండేది
కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
source:news.oneindia.in