హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలోని ప్రయివేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న
దాదాపు రూ.250 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ
సర్కారు సిద్ధమవుతోంది. తమ్మిడికుంట చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్ (ఫుల్
ట్యాంక్ లెవల్) కింద ఉన్న భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని
అధికారులు నిర్ణయించారు.
ఈ చెరువు పరిధిలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతల భూములతో పాటు సినీ
నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటరులోని కొంత భూమి కూడా
ఉందని వార్తలొస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ను
నిర్ధారించి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి అయితే దానిని స్వాధీనం
చేసుకోవాలని, ప్రయివేటు భూమి అయితే అందులో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని
భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న తమ్మిడికుంట చెరువు చుట్టూ ఆరు ఎకరాల పైబడి
భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందంటున్నారు. ఈ చెరువుకు దగ్గరలోనే అయ్యప్ప సొసైటీ
భూములు ఉన్నాయి. ఇందులో కొంత భూమిని నాగార్జున కొనుగోలు చేశారు. ఇదే
ప్రాంతంలో మరో 13 మంది ముస్లీంల పేరుతో భూమి ఉంది. ఈ 14మంది భూములు
ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములతో కలిశాయని అంచనా వేస్తున్నారని వార్తలు
వస్తున్నాయి.
ఎఫ్‌టీఎల్ భూముల్లోనే నాగార్జునకు చెందిన కొన్ని నిర్మాణాలు ఉన్నాయని
అధికారులు చర్యలకు ఇటీవల సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిపై నాగ్ హైకోర్టును
ఆశ్రయించగా నోటీసులు ఇచ్చి, సర్వే చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు
ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించారు. 14
మందికి భూములు ఉన్నాయని తేలడంతో సర్వేకు సిద్ధమయ్యారు. వారికి నోటీసులు
ఇచ్చారు. ఎఫ్‌టీఎల్‌ను మార్కింగ్ చేశాక నిర్మాణాలు తొలగిస్తారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment