హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అసెంబ్లీలో విరుచుకు పడ్డారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి వీరికి హక్కులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైనా అక్రమాలు జరిగినాయని అనుమానాలు ఉంటే విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. నాటి వైయస్ ప్రభుత్వం కర్ణాటకలో ఒకరికి రాష్ట్రంలో భూములు కట్టబెట్టి బెంగుళూరు కమర్షియల్ బిల్డింగ్ జగన్ సొంతం చేసిందని ఆరోపించారు. బ్రాహ్మిణీ స్టీల్స్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కేటాయించక పోవడమే కాకుండా అసలు ఒక్క పైసా పెట్టుబడి పెట్టలేదన్నారు.
ఎన్నికలకు ముందు బ్రాహ్మిణితో పాటు మరో రెండు కంపెనీలకు సుమారు 750 ఎకరాల భూములు కేటాయించారని అన్నారు. జగతి పబ్లికేషన్‌లో పది రూపాయల ముఖ విలువ గల షేరును ఎలా 350 రూపాయలకు కొన్నారని ప్రశ్నించారు. పేదల భూములను పెట్టుబడి దారులకు దోచిపెట్టి వారి సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్‌లో షేర్లన్నీ బూటకమని ఆదాయపన్ను శాఖ నిర్ధారించిందని చంద్రబాబు చెప్పారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఐటి నోటీసులు పంపించిందన్నారు. జగన్ కంపెనీల్లో నల్లధనం ఉందని చంద్రబాబు ఆరోపించారు. పేదల భూములు కొని సొంత లబ్ధి పొందారని ఆరోపించారు.
టిడిపి పెట్టుబడులకు వ్యతిరేకం కాదన్నారు. అభివృద్ధి జరగాలని అన్నారు. అయితే పేదలకు ఇచ్చిన అసైన్డ్‌భూములు, పట్టాభూములు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. డికెటి పట్టాలు రద్దు చేసి పేదల భూములకు పెద్దలకు కట్టబెట్టడాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. సెజ్‌ల పేరుతో రైతులనుండి వేల రూపాయలకు భూములను తీసుకొని వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సెజ్‌ల పేరుతో భూస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రైతుల పొట్టకొట్టే విధంగా సాగుభూములు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు.
తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తే వారిని అరెస్టు చేయడం శోచనీయమన్నారు. తీసుకున్న భూములలో వందల కొద్ది ఉద్యోగాలు ఉంటాయని చెప్పిన ప్రభుత్వం అక్కడ ఇద్దరు ముగ్గురు వాచ్‌మెన్‌లకు మాత్రమే ఉద్యోగులు ఇచ్చిందన్నారు. సెజ్‌ల పేరుతో అవసరానికన్నా ఎక్కువ మేర భూములు తీసుకొని అధికారికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చునని అనుమతి ఇచ్చారని అన్నారు. బడా సంస్థలకు వేల ఎకరాలు కట్టబెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం గుడ్డిగా కళ్లు మూసుకొని భూములు కేటాయించడానికి బ్రాహ్మిణి ఇన్‌పోటెక్ ఓ ఉదాహరణ అన్నారు. వైయస్ హయాంలోని అవినీతిపై చాలాసార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఆయా ప్రభుత్వాలు స్పందించలేదన్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. అయితే చంద్రబాబు వారిపై విరుచుకు పడ్డారు. ఏ పార్టీనుండి గెలిచారు, నీతి, నైతిక విలువలు లేని వారు నన్ను ప్రశ్నించే హక్కు లదేన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పతనం చేసిన వ్యక్తులు తన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి వీరికి ఎవరూ హక్కు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైనా అక్రమాలు జరిగినట్టు అనిపిస్తే విచారణ జరిపించుకోవచ్చునని చంద్రబాబు సవాల్ చేశారు.
తనపై వైయస్ రాజశేఖరరెడ్డి 22 కమిటీలు వేసి ఏమీ చేయలేక పోయారన్నారు. తనపై అవసరమైతే వంద కమిటీలు వేసుకొని విచారణ జరిపించుకోవచ్చునని అన్నారు. అవినీతిపై తాను యుద్ధం చేస్తున్నందుకే తనపై బురద జల్లుతున్నారని అన్నారు. జగన్‌కు దోపిడీ సాక్షి పత్రిక ఉందని బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
No comments:
Post a Comment