నాలుగు జిల్లాలకు చెందిన సింగరేణి కార్మికులు కూడా సహాయ నిరాకరణకు సమాయత్తమయ్యారు. బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేయడానికి వారు పూనుకున్నారు. అన్ని గనుల్లోనూ పనులు జరగకుండా బైఠాయించాలని వారు నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆయన సోమవారం వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు. బిల్లు ప్రతిపాదించడం అటుంచితే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాజకీయ నాయకులు కూడా కోరుతున్నారు.
ఉద్యోగుల సహాయ నిరాకరణకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా మద్దతు ప్రకటించారు. సహాయ నిరాకరణ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు తాను ధర్నాకు దిగుతానని ఆమె హెచ్చరించారు. మొత్తం మీద సహాయ నిరాకరణపై వాతావరణం వేడెక్కుతోంది
No comments:
Post a Comment