ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, February 2, 2011
వైయస్ జగన్‌ను ఎదుర్కునే సత్తా చిరంజీవికి ఉందా?
వైయస్ జగన్‌ను ఎదుర్కునే సత్తా చిరంజీవికి ఉందా?
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఉందా అనేది విషయం చర్చనీయాంశంగా మారింది. జగన్‌ను ఎదుర్కోవడానికే కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని చేరదీస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సత్తాపై చర్చ జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాగత వ్యవహారాలను కొలిక్కి తెచ్చి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారనే భావన ఉంది. ఈ స్థితిలోనే కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని, వచ్చే ఎన్నికలకు సారథ్యం వహించాలని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెసుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణ బాధ్యతలు పూర్తిగా మోయాల్సిన భారం చిరంజీవిపై ఉండదు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి.
వైయస్ జగన్ వ్యవస్థాగత వ్యవహారాల్లో, వ్యూహారచనలో దిట్ట అని భావిస్తారు. తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసే శక్తి సామర్థ్యాలు, అంగ, అర్థబలాలు జగన్‌కు ఉన్నాయని అంటారు. అటువంటి జగన్‌ను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. చిరంజీవికి ఆ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇమేజ్ పరంగా జగన్‌పై చిరంజీవిదే పైచేయిగా ఉంటుందని భావిస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని మిగతా విషయాలను తమకు వదిలేయాలని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు వ్యవస్థాగత నిర్మాణం చిరంజీవికి కలిసి వస్తాయని అంటున్నారు. దానికితోడు, ప్రజారాజ్యం ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెసు వైపు మళ్లుతుందని అనుకుంటున్నారు. ఈ రీత్యా రాష్ట్రంలో చిరంజీవిని ఎదుర్కోవడానికి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి బాగా పనికి వస్తారని అనుకుంటున్నారు.
No comments:
Post a Comment