2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో టెలికం మాజీ మంత్రి ఎ రాజా అరెస్టు
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె నేత, టెలికం మాజీ మంత్రి ఎ రాజాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సిబిఐ అధికారులు అధికారికంగా ప్రకటించారు. సిబిఐ విచారణకు ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు హాజరయ్యారు. ఆయనను విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేశారు. సిబిఐ కార్యాలయంలోకి వెళ్లిన రాజా బయటకు రాలేదు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజా పాత్ర ఉన్నట్లు తగిన సాక్ష్యాధారాలు లభించడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయనతో పాటు టెలికం మాజీ అధికారులు చందోలియా, బెహురియాలను కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.
2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో సిబిఐ రాజాను ఇప్పటికే మూడు సార్లు విచారించింది. నిరుడు డిసెంబర్ 24, 25 తేదీల్లో రాజాను సిబిఐ 12, 13 గంటల పాటు విచారించింది. మళ్లీ జనవరి 30వ తేదీన విచారించింది. బుధవారం నాలుగోసారి విచారణకు రాజా హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీన దర్యాప్తు పురోగతిని సిబిఐ సుప్రీంకోర్టుకు వివరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజాను సిబిఐ అరెస్టు చేశారు. కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా, మరో ఇద్దరు అధికారులపై కూడా ఉచ్చు బిగిస్తోంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజా అరెస్టు డిఎంకెకు పెద్ద షాక్‌గానే చెప్పాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment