BREAKING NEWS
Saturday, January 29, 2011
సూరి హత్య కేసు: మీడియా ముందుకు నలుగురు నిందితులు
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నలుగురు నిందితులను హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. భాను కిరణ్ గన్‌మన్ మన్మోహన్ సింగ్‌తో పాటు సుబ్బయ, ఆవుల వెంకటరమణ, బోయ వెంకట హరిబాబు అనే వ్యక్తులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. పరిస్థితిని బట్టి సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అని, అతను పరారీలో ఉన్నాడని ఖాన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సూరిని భానుయే కాల్చి చంపాడని ఆయన చెప్పారు. భాను కోసం మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత స్థితిని బట్టి ఆర్థిక లావాదేవీలు, భూ దందాలు, స్పర్థలు సూరి హత్యకు కారణమని అర్థమవుతోందని, భాను దొరికితే మరేదైనా కోణం వెలుగు చూస్తుందేమో చెప్పలేమని ఆయన అన్నారు. నిందితుల నుంచి సిమ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. హత్యకు ఎప్పుడు ప్రణాళిక రచించుకున్నాడో భాను దొరికితేనే తెలుస్తుందని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment