ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 21, 2011
తెలుగు సినీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కన్నుమూత
తెలుగు సినీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కన్నుమూత..
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఈవీవీని ఈ నెల 19న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఇవివి వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేశ్, 'అల్లరి' నరేశ్‌ఉన్నారు. ఈవీవీ 51సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఈవీవీగా సినీరంగంలో పేరు తెచ్చుకున్న ఈదర వీర వెంకట సత్యనారాయణ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. నిడదవోలులో విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండటంతో మద్రాస్‌కు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. నవత కృష్ణంరాజు సలహా మేరకు దర్శకత్వ శాఖలో చేరి ప్రముఖ దర్శకుడు జంధ్యాల దగ్గర అసిస్టెంట్‌గా పలు చిత్రాల్లో పని చేశారు. సినిమాల్లో వినోదాన్ని పండించటం ఆయన దగ్గరే నేర్చుకున్నారు. దర్శకునిగా ఈవీవీ 'చెవిలో పువ్వు' చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమఖైదీ సినిమాతో ఆయనకు తొలిహిట్ లభించింది.
ఒక దశలో ఆయన దర్శకత్వంలో వరుసగా దాదాపు 10 హిట్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేశ్ తదితర అగ్ర హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు తీశారు. ముఖ్యంగా కామెడీహీరో రాజేంద్రప్రసాద్‌తో ఈవీవీ తీసిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. సీనియర్ నటుడు శోభన్‌బాబుతో ఏవండీ ఆవిడొచ్చింది, హిందీలో అమితాబ్‌బచ్చన్ హీరోగా సూర్యవంశ్ తీశారు. కుమారులిద్డరితోనూ బెండు అప్పారావు, ఎవడి గోల వాడిది, అత్తిలి సత్తిబాబు, కితకితలు తదితర సినిమాలు రూపొందించారు. వినోదంతోపాటు సెంటిమెంటు, సీరియస్ సినిమాల్లో కూడా ఈవీవీ పలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ఆమె, తాళి, అమ్మో ఒకటో తారీఖు తదితర సినిమాలు ఈ కోవకే చెందుతాయి. దర్శకునిగా ఆయన చివరి సినిమా కత్తి కాంతారావు. కుమారుడు నరేశ్ హీరోగా తీసిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
No comments:
Post a Comment