న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యోగులను మిలియన్ మార్చ్‌లో పాల్గొనకుండా కుట్రలో భాగంగా తమను ఢిల్లీకి తీసుకు వచ్చారని తెలంగాణ ఉద్యోగు ఐక్య కార్యాచరణ సమితి నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీపైన మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా తమను ఢిల్లీకి పంపిందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలతో అపాయింట్‌మెంట్ ఖరారు కాకుండానే తమను ఢిల్లీకి రప్పించడం విచారకరమన్నారు. కాగా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాల స్థానంలో తెలంగాణ అమరవీరుల విగ్రహాల్ని పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
మిలియన్ మార్చ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని విధాల తెలంగాణ ప్రజలు సహకరించారని, అయితే ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఆ ప్రశాంతతను చెడగొట్టారన్నారు. బలవంతపు అరెస్టుల పేరు చెప్పి మిలియన్ మార్చ్‌లో పాల్గొనకుండా చాలా మందిని అడ్డుకున్నారన్నారు. సహాయ నిరాకరణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి బలి కాలేదని, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు చెప్పారు. విగ్రహాల విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ఆరువందలకు పైగా విద్యార్థులు మరణించినప్పుడు వారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
No comments:
Post a Comment