హైదరాబాద్: కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్కటయ్యారని, వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం కొద్ది కాలంగా విమర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా అనే ప్రశ్నకు జవాబు చెప్పాలని కూడా జగన్ వర్గం నాయకులు చంద్రబాబును డిమాండ్ చేశారు. అయితే, అదేమీ లేదని చెప్పడానికి చంద్రబాబు వద్ద ఏమీ మిగలలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం చేసిన ప్రకటన ఆ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. చంద్రబాబు తరఫున కూడా ఆయనే మాట్లాడారు. బలం లేకపోవడం వల్లనే కడప జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని చెప్పేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎవరి ఓట్లయినా అడుగుతామని కూడా ఆయన చెప్పారు. తాము పోటీ చేయని చోట్ల తమ ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు గురువారం సాయంత్రం చెప్పారు. అయితే, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉండేలా లేరు. మిగతా చోట్ల కూడా బహుశా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలను, ముఖ్యమంత్రి ప్రకటనను చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఒప్పందం కుదిరినట్లే కనిపిస్తోందని అంటున్నారు. ఆదిలోనే వైయస్ జగన్‌ను, అందులోనూ కడప జిల్లాలో దెబ్బ తీయడానికి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటైనట్లు అనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప జిల్లాలో వైయస్ జగన్ వర్గం నుంచి శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవరగుడి నారాయణ రెడ్డిని పోటీకి దించుతోంది.
దేవరగుడి నారాయణ రెడ్డిని ఓడించి ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవడానికి జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం జిల్లా నాయకులతో సమావేశాలు, విందులు జరుపుతూ తమ వైపు తిప్పుకుంటున్నారు. అంతేకాకుండా, కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలు వస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ వర్గం, తెలంగాణలో తెరాస గెలుస్తాయనే భయంతోనే వారిద్దరు ఒక్కటైనట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
No comments:
Post a Comment