ముంబై: శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన వేసిన బంతిని సిక్స్‌గా మలిచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా పది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించింది. ప్రపంచ కప్ టైటిల్ భారత్ దక్కించుకోవడం ద్వారా సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ సాధించింది. భారత ఆటగాళ్లు మైదానంలోకి చేరుకుని ఆనంద భాష్పాలతో విజయాన్ని ఆనందించారు. హర్భజన్ సింగ్ సంతోషంతో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు అది గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రపంచ కప్ పూర్తి కావడంతో ఆయన భారత కోచ్ పదవి నుంచి తప్పుకోబోతున్నాడు. భారతదేశమంతటా దీపావళి పర్వదినమే కనిపించింది. పెద్ద యెత్తున టపాసులు పేలుస్తూ విజయాన్ని తనివి తీరా ఆస్వాదించారు. యువరాజ్ సింగ్ ఆనందంతో కంట తడిపెట్టాడు.
కులశేఖర వేసిన 47వ ఓవరులో ధోనీ, యువరాజ్ చెరో ఫోర్, సింగిల్స్ ద్వారా 11 పరుగులు చేయడంతో ఆట భారత్ చేతిలోకి వచ్చింది. అంతకు ముందు మలింగ వేసిన ఓవరులో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. కులశేఖర వేసిన ఓవరు తర్వాత 18 బంతుల్లో 16 పరగులు చేయాల్సి ఉండింది. దీంతో డ్రెసింగ్ రూంలో భారత ఆటగాళ్లు హర్షాతిరేకాలు చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాతి మలింగ ఓవరులో యువరాజ్ సింగ్ ఓ సింగిల్ తీయగా, ధోనీ బంతిని బౌండరీ అవతలికి తరలించి నాలుగు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి బంతిని కూడా అతను ఫోర్‌గా లమిచాడు. అప్పటికి 15 బంతుల్లో భారత్ ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఇరువురు బ్యాట్స్‌మెన్ తొలుత సంయమనం కుదరక కాస్తా ఇబ్బంది పడ్డారు. రన్నవుట్ కాబోయే ప్రమాదాలను తప్పించుకున్నారు. రెండు ఓవర్లు మిగిలి ఉండగా భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది.
పరుగులేమీ చేయకుండానే భారత డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్‌కు గౌతం గంభీర్ తోడుగా నిలిచాడు. తొలుత బాగానే బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించిన సచిన్ టెండూల్కర్ లసిత్ మలింగ బౌలింగ్‌లో సంగక్కరకు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 31 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది. కప్ ఇండియా చేజారిపోతుందేమో అనిపించింది.
అయితే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ గంభీర్‌తో కలిసి ఆచితూచి షాట్లు కొడుతూ పరుగులు రాబట్టారు. కానీ విరాట్ కోహ్లీ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్ చేతిలో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు భారత్ స్కోర్ 114 పరుగులు. విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగుకు దిగిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్ పోటీల్లో తొలిసారి రాణించాడు. పట్టుదలతో ఆడాడు. ధోనీ, గంభీర్ స్కోరును విజయం దిశగా నడిపించారు. శ్రీలంక బౌలర్లు వీరిద్దరిపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సంగక్కర మార్చి మార్చి బౌలర్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు గౌతం గంభీర్ పెరేరా బౌలింగులో 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ స్కోరు 223 పరుగులు ఉంది. విజయానికి 52 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా, ధోనీకి తోడుగా యువరాజ్ సింగ్ బ్యాటింగుకు దిగాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన మహేలా జయవర్ధనే అద్భుతమైన సెంచరీతో శ్రీలంక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. జయవర్ధనే 103 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోయినా చివరలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జయవర్ధనేకు చక్కని సహకారం అందించడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను కంగు తినిపించారు. చివరి ఐదు ఓవర్లో బ్యాటింగ్ పవర్ ప్లేలో శ్రీలంక 63 పరుగులు పిండుకుంది. కులశేఖర ఓ సిక్స్ సహాయంతో 32 పరుగులు చేయగా, పెరేరా 22 పరుగులు చేశారు. జహీర్ ఖాన్ బౌలింగ్‌ను కూడా పెరేరా చితకబాదాడు.
తొలుత శ్రీలంక స్కోరు 17 పరుగులు ఉన్నప్పుడు రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఉపుల్ తరంగ వికెట్‌ను జహీర్ ఖాన్ తీసుకున్నాడు. ఆ తర్వాత దిల్షాన్, సంగక్కర స్కోరును ముందుకు కదిలించే పని సాగించారు. అయితే, 60 పరుగుల వద్ద దిల్షాన్ హర్భజన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన జయవర్ధనేతో సంగక్కర నిలకడగా ఆడి స్కోరును పెంచాడు. 122 పరుగుల వద్ద సంగక్కర యువరాజ్ బౌలింగులో అవుటయ్యాడు. సంగక్కర 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే యువీ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా సమరవీర పెవిలినయ్ దారి పట్టాడు. అప్పుడు శ్రీలంక స్కోరు 179 పరుగులు. ఆ తర్వాత మూడు పరుగులకే కపుగెదర అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కులశేఖర, పెరేరా భారత బౌలింగుపై విరుచుకుపడ్డారు. జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లకు రెండేసి వికెట్లు లభించగా, హర్భజన్‌కు ఒక్క వికెట్ లభించింది. శ్రీశాంత్ బౌలింగులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ దండిగా పరుగులు రాబట్టుకున్నారు.
అంతకు ముందు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ వేయడంలో కొంత అయోమయం చోటు చేసుకుంది. దీంతో రెండు సార్లు టాస్ వేయాల్సి వచ్చింది. మొదటి సారి వేసినప్పుడు భారత్ టాస్ గెలిచింది. రెండోసారి వేసినప్పుడు శ్రీలంక గెలిచింది.
No comments:
Post a Comment