హైదరాబాద్: సినీ ప్రముఖులు అనుష్క, రవితేజ, నాగార్జునలపై ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు దాడులు చేయడం వెనక గల మతలబు ఏమిటనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. వీరి ముగ్గురి ఇళ్లలోనే కాకుండా సినీ నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. అక్కినేని గ్రూపు సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూర్‌ల్లో పెద్ద మొత్తంలో ఐటి అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. అయితే, ఈ సోదాల్లో బయటపడిన విషయాలు ఇంకా వెలుగు చూడలేదు. ఆదాయం పన్ను అంచనాల్లో లోపాలే ఈ దాడులకు కారణమని భావిస్తున్నారు.
రవితేజ, అనుష్కల రెమ్యునరేషన్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. వీరిద్దరు కూడా పెద్ద మొత్తంలో సొమ్ము పెట్టి విశాఖపట్నంలో భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల లావాదేవీల వ్యవహారాల వల్లనే ఐటి శాఖ కన్ను వారిపై పడిందని చెబుతన్నారు. విశాఖపట్నంలో అనుష్క కొనుగోలు చేసిన భూమి విషయంలో చట్టపమైన వివాదం కూడా చెలరేగింది. కేసు నడుస్తోంది. అనుష్కపై ఓ ఎన్నారై ఫిర్యాదు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన విషయాలను వీరిద్దరు కూడా ఐటి రిటర్స్స్‌లో చూపించలేదని తెలుస్తోంది. అందుకే ఐటి శాఖ సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.
అలాగే నాగార్జున కూడా పెద్ద మొత్తంలో సొమ్ము పెట్టి విశాఖపట్నంలో భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. హైదరాబాదులోని హైటెక్ సిటీ వద్ద దాదాపు 500 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టును కూడా చేపట్టినట్లు చెబుతున్నారు. అక్కినేని గ్రూపు సంస్థలను, ఎఎన్ఆర్ గ్రూపు సంస్థలను కూడా విస్తరించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలేవీ నాగార్జున సమర్పించిన ఐటి రిటర్న్స్‌లో చూపించలేదని, వాటి గుట్టు తేల్చేందుకే ఐటి అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం.
No comments:
Post a Comment