హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు
ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ సూర్యనారాయణ
కుటుంబసభ్యులతో గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.
ఆయన భార్య నాగరామలక్ష్మి (53) నాలుగు రోజుల క్రితం విజయవాడలోని బంధువుల
ఇంటికి వెళ్లింది. రాజమండ్రిలో ఎంబీబీఎస్ చదువుతున్న కూతురు సింధూర (19)ను
దసరా పండగకు హైదరాబాద్ తీసుకురావాలనుకుంది. తల్లీకూతుళ్లతో పాటు
నాగరామలక్ష్మి సోదరుడు మహీధర్ (50), అతడి కుమార్తె అపర్ణ (20) సోమవారం
కారులో హైదరాబాద్ బయలుదేరారు.
మార్గమధ్యంలో శంషాబాద్ మండల పరిధిలోని కిషన్‌గూడ జంక్షన్ వద్ద ఆగి ఉన్న
కర్నాటక రాష్ట్రానికి చెందిన లారీని కారు ఢీకొంది. సగ భాగం లారీ కిందకి
దూసుకుపోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న మహీధర్,
నాగరామలక్ష్మి, సింధూరకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడ్డ అపర్ణను శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు.
source:news.oneindia.in