హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా మార్పు చోటు చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇమేజ్ పెరిగి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఇమేజ్ తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చిరంజీవి ప్రతిష్ట పెరిగింది, జనాదరణ కూడా పెరిగిందని భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీలో ఆయనకు అతి ముఖ్యమైన పదవి లభిస్తుందని, 2014 ఎన్నికల్లో కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవేనని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఇమేజ్ పెరిగినట్లు భావిస్తున్నారు.
దాంతోనే వివిధ కార్యక్రమాలకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించే సంఖ్య కూడా పెరిగిందని అంటున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో కూడా చిరంజీవి కాంగ్రెసు తరఫున ప్రచారం చేయనున్నట్లు ప్రజారాజ్యం పార్టీ నేత సి. రామచంద్రయ్య చెప్పారు. దానికితోడు, చిరంజీవిలో ఆందోళన కూడా పూర్తిగా తగ్గినట్లు చెబుతున్నారు. చిరంజీవిలో ఆందోళన కూడా తగ్గిందని చెబుతున్నారు. ఏ మాత్రం ఒత్తిడికి గురి కావడం లేదని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని నడిపించాల్సిన స్థితిలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, పార్టీ నాయకులను ఒకతాటిపై ఉంచడానికి ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురయ్యేవారని చెబుతున్నారు.
ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయి, తన వెంట కాంగ్రెసులోకి వస్తున్న నాయకులకు తగిన ప్రాధాన్యం ఉండేలా చూసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. పైగా, రానున్న రాష్ట్ర రాజకీయాలు చిరంజీవికి, వైయస్ జగన్‌కు మధ్య సమరంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఇరువురి నేతలను పోల్చి చూడడం కూడా ప్రారంభమైంది. కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆ మేరకు ఇమేజ్ తగ్గుతున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌పై మొదట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అది క్రమంగా తగ్గుతున్నట్లు భావిస్తున్నారు. పార్టీ పెట్టడంలో జాప్యం జరుగుతుండడం కూడా అందుకు ఒక కారణమని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన ప్రధానంగా అధికారంపైనే దృష్టి పెడుతున్నారనే అభిప్రాయం బలంగా ప్రజల్లోకి వెళ్లిందని, ముఖ్యమంత్రి పదవిపై మాత్రమే దృష్టి పెట్టారని జరుగుతన్న ప్రచారం ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్లినట్లు భావిస్తున్నారు.
దీనివల్ల ఆయనకు పదవీ కాంక్ష తప్ప మరోటి లేదని భావించే స్థితి వచ్చేసిందని చెబుతున్నారు. అంతేకాకుండా, వైయస్ జగన్‌పై ప్రత్యర్థులు అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. క్రమక్రమంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహారాలు కూడా అంత పారదర్సకంగా జరగలేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ నాయకులు, కాంగ్రెసు నాయకులు ఆ దిశలో విమర్శలకు, ఆరోపణలకు పదును పెట్టారు. ఆ ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టడంలో సాక్షి మీడియా, వైయస్ జగన్ వర్గం నాయకత్వం విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది.
తాజాగా, వైయస్ జగన్ వ్యవహారంలో కాకర్లపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతి అంశంపై వైయస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టింది. వైయస్ హయాంలో అధికారాన్ని ఉపయోగించుకుని వైయస్ జగన్ పెద్ద యెత్తున సంపదను కూడగట్టాడనే ప్రచారం, దాని రక్షణకే అధికారం కోరుకుంటున్నారనే విషయం ప్రజల్లోకి మెల్లమెల్లగా వెళ్తోంది. వైయస్ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసినట్లు కనిపిస్తూనే వివిధ రూపాల్లో సంపదను, వనరులను తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని, అందులో వైయస్ జగన్ పెద్ద యెత్తున సంపదను పోగు చేసుకున్నారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించిందని అంటున్నారు.
పైగా, వైయస్ జగన్ కాంగ్రెసులో ఉంటే మద్దతివ్వడానికి చాలా మంది ఉన్నారు గానీ బయటకు వెళ్లిన తర్వాత మద్దతు ఇవ్వడానికి వెనకాడుతున్నారనే ప్రచారం కూడా పెద్ద యెత్తునే సాగుతోంది. వైయస్ జగన్ వెంట ఉన్నవారు అధికారాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడేవారు కాదని, వారికి జగన్ అవసరం ఉంది గానీ వారు జగన్‌కు ఉపయోగపడే స్థాయిలో లేరని అంటున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ ప్రభ తగ్గుతూ చిరంజీవి ప్రభ పెరుగుతోందనే అభిప్రాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
No comments:
Post a Comment